పోలీస్‌స్టేషన్, మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎరజ్రెండా హెచ్చరిక లేఖలు
తూప్రాన్: పట్టణంలో ఎర్రజెండా, విప్లవ లేఖలు ప్రత్యక్షం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఏపీటీహెచ్ అలెగ్జాండర్ పేరుతో ఉన్న కరపత్రాలు, ఎర్ర బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారంతో పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో వేయడంపై పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఇటీవల పది మంది విప్లవ యోధులకు ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సదరు కరపత్రంలో పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు వచ్చిన సమయంలో తాము మొదటి లేఖను రాశామని, ఇప్పుడు విడుదల చేస్తున్నది తమ రెండవ లేఖ అని ఆ కరపత్రంలో విప్లవ గ్రూపు స్పష్టం చేసింది. ఉరిశిక్షలకు వ్యతిరేకంగా తాము సాగించే పోరాటాన్ని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తామంటూ లేఖ ద్వారా హెచ్చరించారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఎర్రజెండా, కరపత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఈ లేఖలను అక్కడ వేసింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో తూప్రాన్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.


