ఎమ్మెల్యే సునీతారెడ్డి
మెదక్ కలెక్టరేట్: వెల్దుర్తి మండలం బస్వాపూర్ వద్ద గల దేవుని బండను క్రషర్‌కు ఇవ్వొద్దని ఎమ్మెల్యే సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై సుమారు రెండుగంటల పాటు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. వెల్దుర్తి మండలం బస్వపూర్ వద్ద గల దేవుని బండను మూడు గ్రామాలకు చెందిన ప్రజలు ఆరాధిస్తారని, క్రషర్‌కు ఇస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయన్నారు. అలాగే గ్రామాలకు సమీపంలో ఉండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, దానిని నిలిపివేయాలని కోరారు. అలాగే శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లిలో ఎస్సీలకు గతంలో కేటాయించిన భూమిలో కాంగ్రెస్ నాయకుల బంధువులకు 4 ఎకరాలు పట్టా చేయడం దారుణమన్నారు. సర్వేచేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. నర్సాపూర్‌లోని డబుల్‌బెడ్రూంలను అర్హులైన నిరుపేదలకు అందజేయాలన్నారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు.


