మెదక్ కలెక్టరేట్: పంటలు ఎండిపోతున్నాయి.. చెరువు నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలని టేక్మాల్ మండలం సురంపల్లి రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో 110 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉందని, వర్షాలు పడకపోవడంతో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. వెల్పుగొండ చెరువులో నిండా నీరున్నా.. పంటలకు వదలడం లేదన్నారు. ఈవిషయమై ఇరిగేషన్ అధికారులకు చెప్పినా, పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో సర్పంచ్ పోచయ్యతో పాటు ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్‌లు భాగ్యరాజు, చంద్రయ్య, ఉపేందర్, నాయకులు రాజు, నరేశ్ రైతులు పాల్గొన్నారు.


