జిల్లా ఆస్పత్రుల కో ఆర్డినేటర్ డాక్టర్ శివదయాళ్
రామాయంపేట(మెదక్): స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, డాక్టర్లు, ఇతర సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని ప్రభుత్వాస్పత్రుల జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శివదయాళ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ఆస్పత్రిని సందర్శించి కొత్తగా వచ్చిన డాక్టర్లు, ఇతర సిబ్బందితో మాట్లాడారు. కొత్తగా ఇద్దరు మత్తు డాక్టర్లతోపాటు జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, చిన్న పిల్లల డాక్టర్లు ఇద్దరు విధుల్లో చేరారని ఆయన పేర్కొన్నారు. త్వరలో గైనకాలజిస్ట్ పోస్టును భర్తీ చేయడం జరుగుతుందని, తద్వారా ప్రసవాల సంఖ్య పెంచుతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను కాకుండా ప్రభుత్వాస్పత్రులను సద్వినియోగపర్చుకోవాలని డాక్టర్ శివదయాల్ సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రితోపాటు ఇతర డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


