ఇదేం పోకడ! | - | Sakshi
Sakshi News home page

ఇదేం పోకడ!

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

అమాయకులపై అటవీ అధికారుల జులుం

వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నా కానరాని చర్యలు

ఉడుమును పట్టాడని ఓ రైతును నిర్బంధించి చితకబాదారు..

అవమానంతో ప్రాణంతీసుకున్న బడుగు జీవి

అటవీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

జిల్లాలో అటవీ అధికారుల చర్యలు రోజురోజుకు శ్రుతిమీరుతున్నాయి. వారి పోకడపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్లెదుటే వేలాది ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంత మవుతున్నా పట్టనట్లు వ్యవహరించే అధికారులు.. ఓ బడుగు జీవి ఉడుము పట్టాడని నిర్బంధించి చితకబాదడం.. అవమానంతో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. – మెదక్‌జోన్‌

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్ల పరిధిలో అడవి విస్తరించగా కొంత కాలంగా 6 వేల ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఇందులో కొంత రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు భూముల్లో, మరికొంత రెవెన్యూ అధికారులు ఫారెస్టు భూమిని పట్టాలు చేసి ఇవ్వటం, ఇంకా అడవులను ఆనుకుని ఉన్నా గ్రామస్తులు.. ఇలా పలురకాలుగా ఇప్పటి వరకు 6 వేల ఎకరాలకుపైగా కబ్జాకు గురైంది. అంతే కాకుండా ప్రతి వానాకాలం సీజన్‌లో ఎక్కడో ఒకచోటా కబ్జా అవుతూనే ఉంది. ఈ ఏడు సైతం ఇప్పటి వరకు 17 ఎకరాలకు పైగా కబ్జాకాగా నామ్‌కేవాస్తేగా 26 మందిపై కేసులు బుక్‌ చేసి చేతులుదులుపుకొన్నారు.

రెండెకరాలు కబ్జా చేసినా..

ఇటీవల గాజిరెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి రెండు ఎకరాల భూమి కబ్జాచేస్తే అతనిపై ఎలాంటి కేసు పెట్టకుండానే వదిలేసినట్లు ఆరోపణలున్నాయి. అలాగే భూర్గుపల్లి గ్రామానికి చెందిన ఓవ్యక్తి సైతం కబ్జాకు పాల్పడ్డారు. ఇలా ఎంతో మంది కబ్జాకు పాల్పడినా వారిలో కొంత మందిపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి మరికొంత మందిని వదిలేస్తున్నారు. కానీ కొందరు క్షేత్రస్థాయి అధికారులు అమాయకులపై జులం ప్రదర్శిస్తుండటం గమనార్హం.

అటవీ జంతువుల వేటలో..

జంతువులను వేటగాళ్లు అనేక రకాలుగా వేటాడుతున్నారు. కొందరు తుపాకులతో వేటాడుతుండగా, మరి కొందరు ఉర్లు(ఉరి)బిగించి చంపుతున్నారు.. గతంలో పోచమ్మరాళ్‌ తండా ప్రాంతాలోని అడవిలో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు తుపాకులతో జంతువుల వేటకు రాగా వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. రాయిన్‌పల్లి అడవిలోనూ కొందరు వేటగాళ్లు ఉర్లు బిగించి జింకలను చంపారు. ఇటీవల నర్సాపూర్‌ అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు నెమలిని చంపారు. వారిపై సైతం చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. కానీ వారిపై చర్యలు తీసుకున్న పాపానపోలేదు.

బీట్‌ ఆఫీసర్‌ ఓవర్‌ యాక్షన్‌..

పాతూరు గ్రామానికి చెందిన రైతు బుస్స పోచయ్య ఈ నెల 4న అడవిలో ఉడుమును చంపాడనే నెపంతో పాతూర్‌ బీట్‌ అధికారి అతన్ని మెదక్‌ రేంజ్‌ కార్యాలయానికి తీసుకొచ్చి ఇంటరాగేషన్‌ పేరుతో చితకబాదారు. ‘మా తండ్రిని కొట్టవద్దంటూ’ అడ్డుపడిన తనను సైతం కొట్టాడని మృతుడి కొడుకు రఘు బోరున విలపిస్తూ తెలిపారు. ఈ అవమానం భరించలేకే పోచయ్య బలవన్మరణం చెందాడని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

గతంలో సస్పెన్షన్‌

రైతు బుస్స పోచయ్య చావుకు కారణమైన బీట్‌ అధికారి గతంలో రామాయంపేట ఫారెస్టు పరిధిలోని దంతేపల్లి బీట్‌లో విధులు నిర్వహిస్తుండగా సస్పెండ్‌ అయ్యారు. అయినా అతనిలో ఎలాంటి మార్పు రావటంలేదని స్వయంగా ఆశాఖ అధికారులే చెప్పడం కొసమెరుపు. పోచయ్య ఆత్మహత్య ఘటన అనంతరం ఆ అధికారిని పాపన్నపేట మండలానికి బదిలీ చేసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement