సహకారం.. రాజకీయం | - | Sakshi
Sakshi News home page

సహకారం.. రాజకీయం

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

ఎటూ తేలని భవితవ్యం

ఎలాంటి ఆదేశాలు రాలేదు

ఎటూ తేలని భవితవ్యం

నామినేటెడ్‌ కోసం అధికార పార్టీ యత్నం

ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టుకెళ్లిన ప్రతిపక్షం

పాలకవర్గాల గడువు ముగిసి 20 నెలలు

జిల్లాలో 37 పీఏసీఎస్‌లు

రైతుల అభివృద్ధికి తోడ్పాటునందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. పాలకవర్గాల గడువు ముగిసి 20 నెలలు గడిచిపోయినా, ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. నామినేటెడ్‌గా మార్చేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే, ఎన్నికలే నిర్వహించాలంటూ ప్రతిపక్షం హైకోర్టు తలుపుతట్టింది. దీంతో సహకార సంఘాల భవితవ్యం కొలిక్కి రావడం లేదు. – మెదక్‌జోన్‌

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కాల పరిమితి 2025 ఫిబ్రవరి 14తో ముగిసింది. దీంతో వెంటనే పీఏసీఎస్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే అధికారులకు ప్రభుత్వం పర్సన్‌ ఇన్‌చార్జిలుగా ఒక్కొక్కరికి 3–4 సొసైటీల బాధ్యతలు అప్పగించింది. ఈక్రమంలో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. కాలపరిమితి ముగియటంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లేదా ఎన్నికలు నిర్వహించే వరకు ఆ బాధ్యతలు తమకే అప్పగించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎన్నికలు నిర్వహించే వరకు పాత పాలకవర్గాలనే కొనసాగించాలని స్యాయస్థానం తీర్పునిచ్చింది.

పీసీసీ చీఫ్‌ నోట అదే మాట!

గతనెల ఉమ్మడి మెదక్‌ జిల్లా ముఖ్య కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీఏసీఎస్‌, మార్కెట్‌, ఆలయ కమిటీలకు సంబంధించి నామినేటెడ్‌ పదవులను త్వరలో భర్తీ చేస్తామని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. అలాగే సహకార సంఘాలకు సంబంధించి ఎన్నికలు జరగవని, ఇక నుంచి నామినేటెడ్‌ కానున్నాయని చెప్పకనే చెప్పారు. ఇదిలాఉండగా కోర్టు తీర్పు ప్రకారం నడవాల్సిందేనని ప్రతిపక్షం నేతలు చెబుతున్నారు. దీంతో సహకార సంఘాల భవితవ్యం కోర్టు పరిధిలోకి చేరింది.

రైతు సభ్యుల అయోమయం

ఎప్పుడూ లేని విధంగా సహకార సంఘాలను నామినేటెడ్‌గా కేటాయిస్తారని తెలిసి ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 37 సంఘాలు ఉండగా, వాటిలో 55 వేల పైచిలుకు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 13 మంది ఉంటారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వారిలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. మిగితా 11 మంది డైరెక్టర్లుగా కొనసాగుతారు. జిల్లావ్యాప్తంగా 481 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా, అందులో 37 మంది చైర్మన్లు, 37 మంది వైస్‌ చైర్మన్లు. మిగితా 407 మంది సభ్యులుగా ఉంటారు. అయితే ఎన్నికలను రద్దు చేసి పాలకవర్గాలను పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టేందుకు అధికార పార్టీ సిద్ధం అయిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

రిజర్వేషన్లపై నేతల ఆరా

జిల్లాలోని 37 సహకార సంఘాలు ఉండగా, వాటిలో మొత్తం 481 మంది పాలకవర్గం ఉంటుంది. ఇందులో 222 మంది ఓసీలు, 74 మంది ఎస్సీలు, 74 ఎస్టీలు, 74 బీసీలు ఉండగా, 37 మంది జనరల్‌ మహిళలున్నారు. ఈ విషయంపై అధికార పార్టీ నేతలు రిజర్వేషన్ల గురించి సంబంధింత అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది.

పీఏసీఎస్‌ పాలకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం పాత పాలకవర్గాలతోనే సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు జరుగుతాయా..? నామినేటెడ్‌ చేస్తారా..? అనేది స్పష్టత లేదు. – పద్మ, డీసీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement