గణేశ్ మండపాల ఏర్పాటుపై ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: వినాయక చవితి పండుగ నేపథ్యంలో గణేశ్ మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. మండపాల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయడం ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాట్లు సులభతరం అవుతాయని తెలిపారు. దరఖాస్తును సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందించాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు వలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శోభాయాత్రల్లో డీజేలు, టపాసులు వినియోగించరాదని, ఇతరుల మనోభావాలను కించపరిచే నినాదాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.


