కాంగ్రెస్ పాలనపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి ధ్వజం
మెదక్‌జోన్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలన పూర్తిగా మోసపూరితంగా సాగుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని పోస్టాఫీసు వద్ద శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సుకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మీ, తులం బంగారం, ఉచిత స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు క్షీణించాయని, విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోయి పాఠశాలలు మూతపడే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. అంతకుముందు పద్మారెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ, కోలాటం ఆడారు. గిరిజన మహిళలు తెచ్చిన సాంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ అలరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, అకిరెడ్డి కృష్ణారెడ్డి, పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిడ్ల ఆంజనేయులు, చౌదరి సుప్రబాత్ రావు, తదితరులు పాల్గొన్నారు.


