మాస్టారు.. మనసు గెలిచారు | - | Sakshi
Sakshi News home page

మాస్టారు.. మనసు గెలిచారు

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

ఎన్నో అవార్డులు

ఎన్నో అవార్డులు

విభిన్న ప్రయత్నం.. బోధన వినూత్నం

ఆద్మాపూర్‌ ప్రాథమిక పాఠశాల గణితం టీచర్‌ రవిరాజ్‌ ప్రత్యేకత

నర్సాపూర్‌ రూరల్‌: విద్యార్థులు సులభంగానే కాకుండా ఆసక్తితో పాఠాలు నేర్చుకునేలా వినూత్నరీతిలో బోధిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నర్సాపూర్‌ మండలం ఆద్మాపూర్‌ ప్రాథమిక పాఠశాల గణితం ఉపాధ్యాయుడు రవిరాజ్‌. 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి మెదక్‌ జిల్లా కంగ్టి మండలం చౌకన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో 43 మంది విద్యార్థులు. కనీసం బడికి కూడా సరిగా వచ్చేవారు కాదు. ఆటపాటలతో వారికి దగ్గరై, వినూత్న బోధనతో చదువుపై ఆసక్తి పెంచారు. ఫలితంగా 2015లో ఆ పాఠశాల నుంచి బదిలీ అయ్యేనాటికి ఆ సంఖ్య 104కి చేరింది.

అహ్మద్‌నగర్‌లో అద్భుతం

బదిలీపై నర్సాపూర్‌ మండలం ప్రాథమికోన్నత పాఠశాల అహ్మద్‌నగర్‌కు వచ్చేనాటికి ఇక్కడ ఇద్దరు టీచర్లు, 7 తరగతులకు 45 మంది విద్యార్థులు ఉన్నారు. రవిరాజ్‌ తోటి ఉపాధ్యాయుల సహకారంతో గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ కంటే మెరుగైన విద్యాబోధన చేస్తామని, మీ పిల్లలకు చదువు రాకపోతే మమ్మల్ని అడగండి అని భరోసా ఇచ్చారు. దీంతో పాటు ప్యూర్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాఠశాలకు వనరులు సమకూర్చి విద్యలో వెనుకబడిన పిల్లలకు సాయంత్రం ప్రత్యేక క్లాసులు. కరోనా సమయంలోనూ యూట్యూబ్‌ ద్వారా పాఠాలు చెప్పారు. 2024 నాటికి ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 120కి చేరింది.

యూట్యూబ్‌ ఛానల్‌కు ఆదరణ

2024లో ఆద్మాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చేనాటికి 53 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వినూత్న ప్రయత్నాలు ప్రారంభించారు. హోంవర్క్‌ చేయని, బడికి రాని పిల్లల కోసం డిజిటల్‌ క్లాసులు, పజిల్స్‌, ఐక్యూ టెస్టులు, ఐస్‌ బ్రేకింగ్‌ యాక్టివిటీస్‌తో విద్యార్థుల హాజరుశాతం పెంచారు. మరో మ్యాజిక్‌తో ప్రతి రోజు సాయంత్రం పిల్లలకు బోధించే పాఠాలు, విద్యార్థుల ప్రతిభను రికార్డు చేసి తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘రవిరాజ్‌ మాస్టర్‌’లో పోస్ట్‌ చేయడంతో విద్యార్థుల్లో ఆసక్తి, పోటీతత్వం పెరిగింది. కేవలం విద్యార్థుల కోసం మొదలుపెట్టిన ఈ ఛానల్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కేవలం రెండేళ్లలో ఆద్మాపూర్‌ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సంఖ్య 53 నుండి 90కి పెరిగింది.

ఆయన కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు లేకుండానే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసి అవార్డు ఇచ్చింది. దీంతో పాటు బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ టీచర్‌, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, రోటరీ క్లబ్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డులు అందుకున్నాడు. ఇటీవల సింగపూర్‌లో అక్కడి విద్యను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా విద్యా కమిషనర్‌ యోగితా రాణా టూర్‌కు ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement