గాడిన పడని జీవితాలు | - | Sakshi
Sakshi News home page

గాడిన పడని జీవితాలు

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

మల్టీపర్పస్‌ వర్కర్ల ఆవేదన

శ్రమకు తగ్గ గుర్తింపు కరువు

అమలు కాని కనీస వేతన చట్టం

ఆచరణకు నోచని ప్రభుత్వ హామీలు

జిల్లాలో గ్రామ పంచాయతీ మల్టీపర్పస్‌ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఉదయం లేచింది మొదలు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించటం, మురికి కాలువలు శుభ్రం చేయటం, మొక్కల సంరక్షణ, దోమల నివారణ చర్యలు, తాగునీటి నిర్వహణ.. ఇలా గ్రామాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అయినా సరైన వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,697 మంది మల్టీపర్పస్‌ వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 2018లో వీరిని అప్పటి ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంది. 500 జనాభా ఉన్న చోట ఒకరి చొప్పున, ప్రతి గ్రామంలో ఇద్దరు తగ్గకుండా నియమించారు. ఒక్కో వర్కర్‌కు నెలకు రూ. 9,500 చొప్పున వేతనాలు ఇస్తుండగా, వాటిని సైతం సక్రమంగా ఇవ్వటం లేదు. పంచాయతీ అకౌంట్లలో వేతనాలు పడుతున్నాయి. వాటిని డ్రా చేసి కార్యదర్శులు, ఆయా గ్రామాలు సర్పంచ్‌లు కార్మికులకు సకాలంలో ఇవ్వడం లేదని తెలిసింది.

అమలు కాని వేతన చట్టం

ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో అనేక రకాల పనులు చేస్తే కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. నెలకు రూ. 9,500 మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. దీంతో తమ కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నామని మదన పడుతున్నారు. లేబర్‌ యాక్ట్‌ ప్రకారం నెలకు రూ.26,000 చొప్పున వేతనం ఇవ్వాలని, ప్రతినెల జీతం నేరుగా తమ అకౌంట్లలో జమ చేయాలనే ప్రధాన డిమాండ్లతో గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కనీస వస్తువులు కరువే

మల్టీపర్పస్‌ వర్కర్లతో పారిశుద్ధ్యంతో పాటు అనేక రకాల పనులు చేయిస్తున్నారు. కానీ కనీస సౌకర్యా లు కల్పించటం లేదు. చేతులకు గ్లౌస్‌లు, ఆయిల్‌, సబ్బులు, యూనిఫాం తదితర వస్తువులు అందజేయటం లేదు. కొన్ని గ్రామాల్లో మాత్రమే యూనిఫాంలు ఇచ్చి మిగితా ఎలాంటి వస్తువులు ఇవ్వటం లేదు. దీంతో కార్మికులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నట్లు తెలిసింది. జిల్లాలో విధులు నిర్వర్తించే మల్టీపర్పస్‌ వర్కర్లలో 90 శాతం మంది నిరుపేదలే ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement