కవలల ప్రతిభ
అమ్రియా తండా నుంచి నలుగురికి మెడిసిన్ సీటు
పాపన్నపేట(మెదక్): గిరిపుత్రుల గురి తప్పలేదు. స్వేదం చిందిస్తూ, కాయా కష్టం చేసి, కాలేజీకి పంపిన కన్నవారి కలలను వారి పిల్లలు సాకారం చేశారు. పాపన్నపేట మండలంలో బస్సు ముఖం చూడని మారుమూల అమ్రియాతండా నుంచి ఒకేసారి నలుగురు మెడిసిన్ సీట్ సాధించి సత్తా చాటారు. ఇందులో కవలలిద్దరూ ఉన్నారు. ఇదే తండాకు చెందిన సాయికుమర్ ఇప్పటికే మెడిసిన్‌లో పీజీ, మరో విద్యార్థి ఉపేందర్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 300 జనాభా గల ఆ తండాలో ఆరుగురు మెడిసిన్ చదవడం, ఇతర తండావాసులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
వలస కూలీ కొడుకుకు సీటు
తండాకు చెందిన లునావత్ వసూరాం, లక్ష్మి దంపతులు హైదరాబాద్‌లో వలస కూలీలుగా బతుకుతున్నారు. వీరి కుమారుడు నవీన్ గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. నీట్ పరీక్ష రాసి 2,18,058 ర్యాంకుతో కండ్ల కోయలోని సీఎంఆర్ మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. దీంతో అతని తల్లిదండ్రులు తమ కొడుకు డాక్టర్ అయితే ఇక తమ కష్టాలు తీరుతాయని సంతోష పడుతున్నారు.
లునావత్ శ్రీను, దేవి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి రామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు కవలలున్నారు. పిల్లలు మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో రాము ఆల్ ఇండియాలో 1,86,370 ర్యాంకు సాధించి సిరిసిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు సాధించాడు. తమ్ముడు లక్ష్మణ్ 1,20,871 ర్యాంకుతో ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీటు పొందాడు. భవిష్యత్తులో రాము న్యూరో ఫిజిషియన్, లక్ష్మణ్ జనరల్ మెడిసిన్‌లో పీజీ చేసి నిరుపేదలకు ఉచిత వైద్య అందిస్తామని చెబుతున్నారు.


