వెల్దుర్తి(తూప్రాన్): అమలు కాని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ విమర్శించారు. శుక్రవారం మాసాయిపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ తొలి కేబినెట్ సమావేశంలోనే 42 పథకాలపై చర్చించి అమలుకు నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులు, ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంతం కరువు బారిన పడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 22–ఏ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సబ్బండ వర్గాలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ చేపట్టే నిరసనలకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు నాగరాజు, హరికృష్ణ, మన్సూర్, చంద్రాగౌడ్, కృష్ణాగౌడ్, స్టేషన్ శ్రీను, నర్సింహారెడ్డి, శంకర్‌యాదవ్, శ్రీనివాస్‌నాయక్ తో పాటు బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కులేదు
ఎమ్మెల్సీ దేశపతి, ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్


