● నేడు ఈడీ రాక
● సమస్యల పరిష్కారంపై ప్రయాణికుల ఆశలు
నర్సాపూర్: నర్సాపూర్ ఆర్టీసీ డిపోలో పలు సమస్యలు నెలకొన్నాయి. సరిపడా బస్సులు లేక నియోజకవర్గంలోని ప్రధాన మార్గాల్లో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈక్రమంలో శనివారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) కుస్రోషా ఖాన్ డిపోను తనిఖీ చేసేందుకు వస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారంపై ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. 2022లో డిపోను ప్రారంభించగా, అధికారులు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డిపోలో 39 బస్సులలో 32 సంస్థ బస్సులు ఉండగా 7 అద్దె బస్సులున్నాయి. సంస్థ బస్సుల సంఖ్యకు అనుగుణంగా డ్రైవర్లు, కండక్టర్లు లేనందున ఉన్న వారిపై పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు సరిపడా వసతులు లేవని తెలిసింది. రెస్ట్ రూంతో పాటు ఇతర వసతులు మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని సిబ్బంది చెబుతున్నారు. డిపోకు కొత్త బస్సులు కేటాయించి దూర ప్రాంతాలకు సైతం ఇక్కడి నుంచి బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే డిపో ఆవరణలో సీసీ రోడ్డు లేనందున వర్షాలు కురువగానే అంతా బురదమయంగా మారడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అందని ఉచిత ప్రయాణం
మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నప్పటికీ సరిపడా బస్సులు రాకపోవడంతో గ్రామీణ మహిళలకు పథకంతో ప్రయోజనం లేకుండా పోతుంది. నర్సాపూర్ నుంచి బాలానగర్ మార్గంలో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఉదయం పూట ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు భారీ సంఖ్యలో ఇక్కడి నుంచి వెలుతున్నందున వారి సంఖ్యకు సరిపడా బస్సు లు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని నత్నాయిపల్లి మీదుగా పటాన్‌చెరు వరకు సర్వీసును సక్రమంగా నడుపనందున అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం కరువైంది.


