● ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ నియామకం
● జిల్లాలో ఇప్పటివరకు 2.99 లక్షల ఎకరాలు సాగు
రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణతో జిల్లాలో ఏ పంట ఎంతమేర సాగవుతుందో ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వస్తుంది. దీని ఆధారంగానే రైతులకు ఎరువులు, ఇతర సంక్షేమ పథకాలు, పంట నష్ట పరిహారం వంటివి అందుతాయి. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్, రైతుబంధు, ఇతర పథకాలు వర్తించే అవకాశాలున్నాయి. అలాగే సర్వేలో నమోదు చేసిన మేరకు రైతులు పండించిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది.
రామాయంపేట(మెదక్): పంటల సాగు వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు జిల్లా పరిధిలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్‌ను నియమించింది. సర్వే కోసం కేంద్రం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. ఈమేరకు వలంటీర్లు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పంట వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏఈఓలతోనే సర్వే చేయించాలని ప్రణాళికలు సిద్ధం చేయగా, వారు ఇతరత్ర పనులతో బిజీగా ఉండటంతో వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఎంపికై న వలంటీర్లు ఇప్పటికే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సర్వే పనులు ప్రారంభించి ఆన్‌లైన్‌లో సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 2.99 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి.
ఇప్పటికే 234 మంది నియామకం
జిల్లాలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం 380 మంది వలంటీర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే 234 మందిని ఎంపిక చేయగా, వారు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభించారు. ఈమేరకు వారు సర్వేలో తేలిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మిగితా 146 మందిని త్వరలో నియామకం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎంపిక చేయాల్సిన వలంటీర్లు సదరు రెవెన్యూ గ్రామానికి చెందిన వారై ఉండాలి. వారు ఆండ్రాయిడ్ 11 ఫోన్ కలిగి ఉండి, కనీసం పదో తరగతి పాసై ఉండాలి.
ఎంపికై న వారికి ఆన్‌లైన్‌లో శిక్షణ
ఎంపికై న వలంటీర్లు గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 45 రోజుల్లోపు వీరు తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ఏరోజుకారోజు యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్‌లోడ్ చేసిన ఒక్కోదానికి కేంద్రం ఏడు రూపాయలు చెల్లిస్తుంది. ఆన్‌లైన్ విధానం ద్వారా వీరికి డబ్బులు చెల్లించనున్నారు. ఎంపికై నవారికి ఇప్పటికే యాప్ వినియోగం, పంట సాగు నమోదు విషయమై ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారు.


