బీఆర్‌ఎస్‌ పోరుబాట | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పోరుబాట

Sep 1 2026 7:47 AM | Updated on Sep 1 2026 7:47 AM

ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ పోరుబాట పట్టింది. జిల్లాలో గతేడాది వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, పంట కాల్వల మరమ్మతుల చేపట్టాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ధర్నాలు, పాదయాత్రలతో అధికార పార్టీని ఇరుకున పెట్టి అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. మొన్న మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పాదయాత్ర చేయగా, తాజాగా నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాదయాత్ర చేపట్టారు. దీంతో మెతుకుసీమలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

– మెదక్‌జోన్‌

జిల్లాలోని నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజాసమస్యలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గతంలో బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అటు ప్రభుత్వంపై, ఇటు అధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది సింగూర్‌ ప్రాజెక్టుపై ఆధారపడిన ఘనపూర్‌ ఆనకట్ట రైతులకు క్రాఫ్‌హాలిడే ప్రకటించి ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆయకట్టు రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడించి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన చెరువులు, కుంటలు, బ్రిడ్జిలు, కట్టు కాల్వలకు మరమ్మతులు చేయకపోవడంతో వేలాది ఎకరాల ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారాయని, రైతులతో కలిసి రాయినిపల్లి ప్రాజెక్టును సందర్శించారు, కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని ప్రభుత్వం నిలిపి వేసేకుట్ర చేస్తోందని, ఇటీవల కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేశారు. అలాగే నిజాంపేట మండలంలోని చల్మెడ–నందగోకుల్‌ మధ్య గల రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని పాదయాత్ర చేపట్టారు.

ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో ప్రజల్లోకి..

మొన్న పద్మారెడ్డి, నిన్న సునీతారెడ్డి పాదయాత్ర

సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీత

ధర్నాలు, పాదయాత్రలతో జిల్లాలో వేడెక్కిన రాజకీయం

మెదక్‌–వెల్దుర్తి రోడ్డును డబుల్‌రోడ్డుగా నిర్మించాలనే డిమాండ్‌తో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి సోమవారం మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డితో పాటు ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి వెల్దుర్తి నుంచి మెదక్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. వెల్దుర్తి, ఉప్పులింగాపూర్‌, రామాయపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించారు. యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement