మెదక్‌జోన్: ఈనెల 1 నుంచి 30 వరకు జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేయరాదని, అలాచేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన నిరసనలు చేయరాదన్నారు. ఈ విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
నర్సాపూర్: ఈనెల 2వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో 22–ఏ భూ సమస్యలపై నర్సాపూర్‌లో నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నిరసన దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హాజరవుతారని చెప్పారు. పేద రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు.
మెదక్‌జోన్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నేటి మహాధర్నాకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సతీశ్‌రావు కోరారు. సోమవారం పట్టణంలోని కార్యాలయంలో యూనియన్ నేతలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చి న హామీలు అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలన్నారు. సమావేశంలో యూనియన్ నేతలు సౌమ్యానాయక్, తదితరులు ఉన్నారు.
5 వరకు రేషన్ పంపిణీ
డీఎస్‌ఓ నిత్యానంద్
మెదక్ కలెక్టరేట్: నిరుపేదలు రేషన్ బియ్యం తీసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జిల్లాలో మూడు నెలల కోటా గత నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ–కేవైసీ తప్పనిసరి చేయడంతో కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈనెల 5 వరకు రేషన్ బియ్యం తీసుకునే అవకాశం కల్పించిందని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ పేర్కొన్నారు. నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమీపంలోని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం తీసుకోవాలని సూచించారు.
పాపన్నపేట(మెదక్): సమస్యల పరిష్కారం కోసం.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ప్రజావాణికి ఆశించిన మేర స్పందన లభించడం లేదు. సరైన ప్రచారం లేక జనాలు రావడం లేదు. దీంతో అధికారులంతా సెల్‌ఫో న్లు చూస్తు టైంపాస్ చేస్తున్నారు. సోమవారం పాపన్నపేటలో ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో అధికారులు ఇలా ఫోన్‌తో కాలక్షేపం చేశారు.
నారాయణఖేడ్: రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్ష పాత్ర తెలంగాణ రక్షణ సేన పార్టీ (టీఆర్‌ఎస్)నే పోషిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నారాయణఖేడ్‌కు సోమవారం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ స్థాపించి 120 రోజులు అయిందని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ రేవంత్ సర్కార్‌కు వంద చెరువుల నీళ్లు తాగించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినప్పటికీ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపించారు. తమ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అన్నివర్గాల సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. యువతతో పాటు నిరుద్యోగులు, దివ్యాంగులు, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల కోసం తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు.


