కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు కలెక్టర్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులకు రాఖీలు కట్టారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికల హక్కులు, భద్రత, విద్య భవిష్యత్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి విద్యను ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాఖీ వేడుకల ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు బాలికల భద్రత గౌరవాన్ని కాపాడాలనే సామాజిక బాధ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమాభార్గవి, బాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


