పాపన్నపేట(మెదక్): విద్యార్థులకు అల్పాహార పథకాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు టిఫిన్లు సరఫరా చేసేందుకు ,మెదక్‌లోని మార్కెట్ యార్డులో కేంద్రీకృత వంటశాల నిర్మాణం కొనసాగుతోంది. ఇక్కడి నుంచే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టిఫిన్లు సరఫరా చేయనున్నారు. అయితే అనుకున్న ప్రకారం పనులు పూర్తి అవుతే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అల్పాహార పథకం ప్రారంభమయ్యే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. కాగా, అధికారికంగా ప్రభుత్వం ఏదైనా తేదీ నిర్దారిస్తే అందుకనుగుణంగా ప్రారంభం చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
70 వేల విద్యార్థులకు రోజుకో రకం టిఫిన్
జిల్లాలో 881 ప్రభుత్వ పాఠశాలలుండగా సుమారు 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ముఖ్యంగా ఉన్నత పాఠశాల స్థాయిలో చాలామంది విద్యార్థులు సమీప గ్రామాల నుంచి కాలి నడకన ఎలాంటి టిఫిన్లు చేయకుండానే వస్తుంటారు. అందుకే పోషకాహరంతో కూడిన టిఫిన్లు అందివ్వాలని, ప్రభుత్వ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ.8లతో, 6 నుంచి 10 తరగతుల వారికి రూ.12తో అల్పాహారం అందించాలని ప్రణాళిక రూపొందించారు. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యాని, కిచిడి, మరో మూడు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీతోపాటు రాగి జావ, విజయ డెయిరీ పాలు ఇవ్వాలని నిర్ణయించారు.
టిఫిన్ల తయారీ బాధ్యతలు ట్రస్టులకు
జిల్లాలో హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ సంస్థ ద్వారా టిఫిన్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ట్రస్టు ద్వారా కొన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం మెదక్‌లోని మార్కెట్ యార్డులో కేంద్రీకృత వంటశాల ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కరెంట్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. త్వరలో పూర్తయితే కొన్ని పాఠశాలల్లో సెప్టెంబర్ 5న ప్రారంభం చేసే అవకాశముందని, తర్వాత దశల వారీగా అన్ని పాఠశాలల్లో పథకం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ విషయమై విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా కిచెన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. పథకం ప్రారంభోత్సవ తేదీ నిర్ణయం కాలేదన్నారు.
కొనసాగుతున్న కేంద్రీకృత వంటశాలల నిర్మాణం
దశల వారీగా అక్టోబర్ నాటికి అన్ని మండలాలకు
జిల్లాలో సుమారు 70 వేల మందికి టిఫిన్లు


