2న బీజేపీ నిరసన దీక్ష | - | Sakshi
Sakshi News home page

2న బీజేపీ నిరసన దీక్ష

Aug 30 2026 7:18 AM | Updated on Aug 30 2026 7:18 AM

2న బీజేపీ నిరసన దీక్ష రేవంత్‌ను ప్రజలే గద్దె దించేస్తారు

నర్సాపూర్‌ః ప్రజల భూములను 22ఏ నుంచి కాపాడేందుకు సెప్టెంబరు 2న నర్సాపూర్‌లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ధర్నా నిర్వహణపై సన్నాహక సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 22ఏ చట్టం తెచ్చి అమాయక రైతుల భూములను నిషేధితజాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఆ జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలన్న డిమాండ్‌తో స్థానిక బస్టాండ్‌కు ఎదురుగా జాతీయ రహదారిపై జిల్లా స్థాయి నిరసన దీక్ష చేస్తామని తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు సురేశ్‌, రాంలు, కొండల్‌రావు, రమేశ్‌గౌడ్‌, నారాయణరెడ్డి, విజయ్‌, జనార్దన్‌ తదితరులున్నారు.

పాదయాత్రలో పద్మారెడ్డి

రామాయంపేట, నిజాంపేట(మెదక్‌): బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌ సర్కార్‌ను దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన నిజాంపేట మండలం నందగోకుల్‌, చల్మెడ గ్రామాల మధ్య రహదారిని తారు రోడ్డుగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ పద్మారెడ్డి నిర్వహించిన ఆరు కిలోమీటర్ల పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది. వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, నాయకులు వెంట నడిచారు. గత నాలుగేళ్లుగా రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరు కాగా, నిజాంపేట, నస్కల్‌ గ్రామాల మధ్యే తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో పద్మారెడ్డి పాదయాత్రకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ శేరి శుభాష్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శశీధర్‌రెడ్డి, స్ధానిక మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మాజీ జెడ్పీచైర్మన్‌ లావణ్యారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గంగ నరేందర్‌, సీనియర్‌ నాయకులు జీవన్‌రావు, పార్టీ నిజాంపేట మండలశాఖ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement