● బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న వివాదం
● రంగంపేటలో రెచ్చిపోయిన ఇరువర్గాలు
● ఎస్‌ఐ జోక్యంతో శాంతించిన నేతలు
కొల్చారం(నర్సాపూర్): అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ల మధ్య సవాల్..ప్రతి సవాల్‌తో మండలంలోని రంగంపేట గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేశ్‌కుమార్‌పై మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, రంగంపేట గ్రామానికి చెందిన ఆ పార్టీకి చెందిన నాయకులు వారం క్రితం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. దీన్ని సవాలుగా తీసుకున్న రమేశ్‌కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు శనివారం వ్యక్తిగత విమర్శలపై గ్రామ రచ్చబండకు వస్తే సమాధానం ఇస్తామని సవాల్ విసిరారు. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం సై అనడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరు పార్టీల వారు పంచాయతీ రచ్చబండ వద్దకు చేరుకున్నారు. రమేశ్‌కుమార్ తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలపై మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అడ్డుకోవడంతో, ఇటు బీఆర్‌ఎస్ పార్టీ వారు సైతం అదే రీతిలో స్పందించారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హైమద్ మోహినొద్దీన్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సీనియర్ నాయకులుగా ఇరువర్గాలు పంతానికి పోకుండా ప్రెస్‌మీట్‌తోనే సరిపెట్టాలని సర్దిచెప్పడంతో రమేశ్ తన పార్టీ కార్యకర్తలతో కలసి అక్కడినుంచి వెళ్లిపోయారు. రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలు: రమేశ్‌కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ...తనపై తన, పార్టీపై ప్రజలు చూపెడుతున్న ఆదరణను ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రస్తుతం డీసీఎంఎస్ వైస్‌చైర్మన్‌గా ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో నాటి ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్సార్, రోశయ్యలను గ్రామానికి తీసుకువచ్చి, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆరోపిస్తున్నట్లుగా తాను ఏనాడు కబ్జాలకు పాల్పడింది లేదని, ఇప్పటి తమ కుటుంబ ఆస్తులు అమ్ముకొని ప్రజాసంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు వచ్చిన కొందరు నాయకులు ప్రజల సొమ్మును, ప్రజాధనాన్ని దోచుకుంటూ ఆస్తులు కూడబెట్టుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదని, ప్రజలే వారికి బుద్ధి చెప్తారంటూ పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వర్ణలత విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ సురేశ్, గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు, యువజన నాయకులు సుధాకర్, సత్యగౌడ్, గంగా రాములు, ప్రసాద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


