పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు అమ్మ వారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులతో ముందు నడువగా భక్తులు, ఆలయ సిబ్బంది పల్లకీ మోశారు. ఆలయం నుంచి బయలుదేరి రాజగోపురం నుంచి గోకుల్ షెడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది.
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని పాతూర్ జెడ్పీ హైస్కూల్‌లో గురువారం డీఈఓ రాజు విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో యూనిఫాంలు కుట్టించినట్లు తెలిపారు. అవసరమైన నోట్‌బుక్‌లు అందజేస్తూ విద్యార్థులను ప్రోత్సహించి మంచి విద్యనందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం నాగరాజు, కో–ఆర్డినేటర్ మహలక్ష్మి, రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు జిల్లా మైనింగ్ అధికారి నాగరాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా మేడ్చల్ నుంచి జిల్లాలోకి కంకర తీసుకొస్తున్న టిప్పర్‌ను మనోహరాబాద్ వద్ద పట్టుకొని 16 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. రామాయంపేట మండలంలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న జేసీబీని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఎవరైనా సరే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మెదక్ కలెక్టరేట్: పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిచాలని జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ నివేదిక ఫిట్‌మెంట్ ప్రకటన చేయాలన్నారు. ఆరు విడతల కరువు భత్యం విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీఆర్టీఎఫ్, పెన్షనర్స్ అసోసియేషన్ తదితర సంఘాల నాయుకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
సమర్థవంతంగా ‘సర్’
సంగారెడ్డి: సర్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ సీఈఓ అనురాధ సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆమె పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలోని 3,2, 22 వార్డులలో ఏర్పాటు చేసిన వార్డు సభలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఎల్‌ఓలు రజిత, రవి నాయక్, 3వ వార్డు ఆఫీసర్ నవీన్, మాజీ కౌన్సిలర్లు రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


