మెదక్‌జోన్: ‘మహిళలు, బాలికల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థిను ల చదువుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఇటీవలే ‘పోలీస్ అక్కా’ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రవేశపెట్టాం. షీటీంల తో ఆకతాయిల ఆటకట్టిస్తున్నాం. పోక్సోను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. భరోసా సెంటర్ ద్వారా బాధితులకు ఉచితంగా న్యాయ సలహా ఇవ్వడంతో పాటు కోర్టు ఆదేశాలతో పరిహారం అందించి బాధితులకు అండగా నిలుస్తున్నాం’ అని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాఖీ పండుగా నేపథ్యంలో మహిళల రక్షణ చర్యలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
విద్యార్థునులకు కొండంత అండ
జిల్లాలో 21 పోలీస్‌స్టేషన్లు ఉండగా, ప్రతి పీఎస్‌కు ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించాం. వీరు ఆయా మండలాల పరిధిలోని ప్రతి కాలేజీలు, హైస్కూల్స్‌లో విద్యార్థినులతో సమావేశం అవుతున్నారు. ర్యాగింగ్ చేసినా, ప్రేమ పేరుతో ఇబ్బందులు పెట్టినా ఆ మహిళా కానిస్టేబుల్ ఫోన్ నంబర్ ప్రతి విద్యార్థినికి అందజేస్తున్నారు. ఫోన్ రాగానే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ‘పోలీస్ అక్కాను’ కార్యక్రమం ప్రత్యేకంగా జిల్లాలో ఏర్పాటు
పోక్సో బాధితులకు న్యాయం
గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో జిల్లాలో 233 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ట్రయల్‌కు వచ్చిన కేసుల్లో 29 మంది నింధితులకు కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇందులో 12 మందికి 20 ఏళ్ల పాటు శిక్ష పడగా, ముగ్గురికి 10 ఏళ్ల పాటు, 7 గురికి 5 సంవత్సరాలు, ఒక్కరికి ఏడాదికి. మరొకరికి రెండేళ్ల పాటు శిక్ష పడే విధంగా సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాం.
ఆకతాయిల ఆటకట్టు
జిల్లాలో రెండు షీటీంలను ఏర్పాటు చేశాం. ఆకతాయిలను గుర్తించి స్టేషన్ తీసుకువచ్చి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నాం. గడిచిన మాడేళ్లలో వందలాది మందికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు రెండోసారి సైతం మహిళలకు వేధించిన వారిపై కేసులు నమోదు చేశాం.
బాధితులకు ‘భరోసా’
గడిచిన 8 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 15 రేప్ కేసులు కాగా, 57 పోక్సో కేసులు నమోదు చేశాం. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్‌తో బాధిత మహిళలను, బాలికలను ఆదుకుంటున్నాం. మెడికల్, న్యాయ సలహా, సైకాలజిస్ట్‌తో కౌన్సెలింగ్, కోర్టు ఆదేశాల మేరకు పరిహారం అందించి అందిస్తున్నాం. మహిళలు, బాలికల రక్షణ కోసం నిరంతరం నిఘా పెడుతున్నాం.
‘సాక్షి’తో ఎస్పీ శ్రీనివాసరావు


