మెదక్ కలెక్టరేట్: శక్తి పాలసీని రద్దు చేసి ఎస్‌బీటెట్‌ను బలోపేతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహిళా కన్వీనర్ సమ్రిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థినులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన సర్కారు, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేట్ సంస్థలో విలీనం చేస్తే ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతిక విద్య ప్రైవేటు పరమయ్యే అవకాశం ఉందని వాపోయారు. అనంతరం డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ టౌన్ బాధ్యులు గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.


