నర్సాపూర్: వృద్ధ్దాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకులు అన్నం పెట్టడం లేదని మండలంలోని రెడ్డిపల్లికి చెందిన వృద్ధ దంపతులు భద్రయ్య, నాగమణిలు రోదిస్తున్నారు. శనివారం నర్సాపూర్‌లో భద్రయ్య మాట్లాడుతూ.. తన పేరుపై ఉన్న పొలాన్ని తమ పేరుపై పట్టా చేయాలని ఆరునెలల క్రితం తన ఇద్దరు కుమారులు కోరారని తెలిపారు. తాను పొలాన్ని వారి పేరుపై మార్చకపోవడంతో చంపుతామని బెదిరించారని వాపోయారు. వారి బెదిరింపులకు భయపడి తన పొలాన్ని వారి పేరుపై పట్టా చేయించినట్లు చెప్పారు. కాగా పొలం వారి పేరుపై మారినప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదన్నారు. తమకు అన్నం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఇటీవల ఎస్పీ శ్రీనివాస్‌రావును సైతం కలిశామని వివరించారు. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా వారి ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశామని చెప్పారు.


