మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మెదక్, కౌడిపల్లి గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో ఆయా, కుక్ పోస్టుల భర్తీ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈనెల 21 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కౌడిపల్లి మినీ గురుకులంలో ఆయా (1), మెదక్ మినీ గురుకులంలో ఆయా (1), కుక్ (1) పోస్టుకు పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులన్నారు. మెదక్, కౌడిపల్లి మండలాలకు చెందిన ఎస్టీ మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్ధులను పూర్తి మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తామన్నారు.
రైతులు ఆందోళన
చెందొద్దు: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ప్రస్తుతం 3,340 మె ట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 19,045 మెట్రిక్ టన్ను లు రైతులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సొంత మండలాల్లోనే కాకుండా ఇతర మండలాల్లోనూ ఎరువులు కొనుగోలు చేయవచ్చు నని, అలాగని అవసరానికి మించి కొనుగోలు చేయవద్దన్నారు. పరిమితికి మించి రైతులు యూరియా బుక్ చేయడంతోనే యాప్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. జిల్లాలో ఎరువుల యాప్ సమ స్యలపై వ్యవసాయ శాఖ కమిషనర్‌తో మాట్లాడినట్లు చెప్పా రు. వారు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
బాల్య వివాహాలు
చట్టరీత్యా నేరం
జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సుచరిత
అల్లాదుర్గం(మెదక్): బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల బాలికలు చదువు కోవడం వారి హక్కు అని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సుచరిత అన్నారు. శనివారం మండల పరిధిలోని చిల్వెరలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టులలో జడ్జిమెంట్లను స్థానిక భాషల్లో మార్చాల్సి ఉందన్నారు. బాలికలు గుడ్, బ్యాడ్ టచ్ గురించి ధైర్యంగా చెప్పాలన్నారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడితే పోక్సో కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ హింస, మహిళలపై దాడులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేద ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్ శశిధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి లింగప్ప, న్యాయవాది సంగన్న తదితరులు పాల్గొన్నారు.
సింగిడిలో
‘సాయిసిరి’కి చోటు
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ సినీ కవుల పుస్తకంలో జిల్లాకు చెందిన సాయిసిరికి చోటు దక్కింది. సినీకవులు జీవిత విశేషాలు, పాట ల పదప్రయోగ విశ్లేషణను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సింగిడి అనే 390 పేజీల పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించింది. ఈ పుస్తకంలో తెలంగాణ మొట్టమొదటి సినీ కవి చందాల కేశవదాసు నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, గోరటి వెంకన్న, నందిని సిదారెడ్డి లాంటి మహామహుల సరసన జిల్లా ప్రధానోపాధ్యాయుడు, సినీగీత రచయిత సాయిసిరికి చోటు లభించడం పట్ల సాహితీవేత్తలు, రచయితలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పుస్తక రచయిత డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర, తెలంగాణ సాహిత్య అకాడమీకి సాయిసిరి కృతజ్ఞతలు తెలిపారు.
పవిత్రోత్సవాలకు
అంకురార్పణ
వర్గల్(గజ్వేల్): నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శనివారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. పాంచరాత్ర ఆగమ విధానంలో విశ్వక్సేనుల సాక్షిగా ఆలయ కార్యనిర్వహణాధికారి బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు, యజ్ఞాచార్యులు, రుత్విక, భక్తజన పరివారం మేళతాళాలతో ఈరబాయమ్మ తోట నుంచి పుట్టమన్ను తెచ్చారు. ఆలయ ముఖ మండపంలో వేదికపై విశేషాలంకృతులై స్వామివారు లక్ష్మీసమేతులై కొలువుదీరగా, అర్చకులు రక్షా బంధనం, అంకురార్పణ, నివేదన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకను తిలకించి భక్తజనులు తరించారు.


