మెదక్‌లోని ఓ పాఠశాలలో సివిల్ డ్రెస్‌లో బడికి వచ్చిన విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా అందించే రెండు జతల యూనిఫాంల పంపిణీ ప్రక్రియ ఈసారి అస్తవ్యస్తంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు అందజేయలేదు. బడులు
తెరుచుకునే రోజునే ఏకరూప దుస్తులు
పంపిణీ చేస్తామన్న విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఫలితంగా పాత దుస్తులతోనే విద్యార్థులు బడులకు హాజరుకావాల్సి
వస్తోంది. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 882 ఉండగా, వాటిలో 68,323 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా పేద, మధ్య తరగతికి కుటుంబాలకు చెందిన వారే. కాగా, వీరికి 2 జతల యూనిఫాం పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించాల్సి ఉండగా, నేటికీ అందజేయకపోవడం గమనార్హం. స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతల ను స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు అప్పగించారు. పాఠశాలల ప్రారంభం రోజున ప్రతి విద్యార్థికి అందించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. పంద్రాగస్టుకు తప్పనిసరిగా అందించాలని మరోమారు ప్రకటించినా సాధ్యం కాలేదు. కాగా జిల్లాలో 68,323 మంది విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి రెండు జతల చొ ప్పున 1,36,646 యూనిఫాంలు అందించాల్సి ఉంది. ఇందుకోసం 4,10,616 మీటర్ల క్లాత్ సరఫరా చేయాల్సి ఉండగా, విడతల వారీగా జి ల్లాకు అందించారని, చివరగా ఈనెల 18 వరకు పూర్తిస్థాయిలో వస్త్రం చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలోనే కొలతలు
బడులు తెరుచుకునే రోజునే ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫాంలు అందిస్తామని పిల్లపుట్టక ముందే కుళ్లకుట్టిన చందంగా అధికారులు, పాలకులు హడావుడి చేసి మహిళా సంఘాల సభ్యులతో ఫిబ్రవరిలోనే కొలతలు తీయించారు. అయితే బడులు తెరిచే సమయానికి కాదు కదా, కనీసం క్లాత్‌కూడా సరఫరా చేయలేక పోయారు. సర్కార్ బడుల్లో చదువుకునే వారంతా పేద కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉంటారు. కాగా పేద, ధనిక తారతమ్యం లేకుండా విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిద్రావస్థలో ఉండటంతో నేటికీ యూనిఫాంలు అందించలేక పోయారు. మరో నెలరోజుల గడువు పట్టే అవకాశం ఉందని సంబంధిత అధికారులే చెబుతున్నారు.
గురుకుల విద్యార్థులకు మాత్రం..
జిల్లావ్యాప్తంగా కేజీబీవీలు, సోషల్, ట్రైబల్ వేల్ఫేర్, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు 26 ఉండగా, వాటి పరిధిలో 8,650 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మాత్రం జూన్ చివరి వారంలో క్లాత్ సరఫరా కాగా, వారికి యూనిఫాంలు కుట్టి అందించారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున 17,300 యూనిఫాంలు అందించాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఒక్కో జత అందించినట్లు తెలిసింది.
క్లాత్ ఆలస్యంగా వచ్చింది
విద్యార్థుల యూనిఫాంలకు సంబంధించిన బాధ్యతలు గ్రామీణాభివృద్ధి (సెర్ప్) శాఖకు అప్పగించారు. క్లాత్ రావటం చాలా ఆలస్యం అయింది. కుట్టిన యూనిఫాంలు కుట్టినట్లు విద్యార్థులకు సరఫరా చేయాలని చెప్పాం.
– రాజు, డీఈఓ


