మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, విద్యార్థులకు విద్య దూరం చేసే ప్రైవేటీకరణ విధానాలను వెంటనే విరమించుకోవాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. బుధవారం మెదక్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యలోకి ప్రవేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కీల్ యూనివర్సిటీ జాతీయ విద్యావిధానంలో భాగంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అన్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి సంతోశ్, నాయకులు కార్తీక్, శ్రీవిద్య, సోనీతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు.


