నర్సాపూర్: కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ప్రధానకార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ నెల 2నుంచి చేపట్టిన ‘అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర’గురువారం నర్సాపూర్ చేరుకుంది. పలువురు గీత కార్మికులు, సీపీఎం నాయకులు చైతన్యయాత్ర ప్రతినిధులకు స్థానిక చౌరస్తా వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గౌడ సంక్షేమానికి కల్లుగీత కార్మికుల ఉపాధికోసం బడ్జెట్‌లో రూ.ఐదు వేల కోట్లు కేటాయించాలన్నారు. పెన్షన్ పెంచాలని, కార్మికులకు ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు ఇతర నాయకులు పాల్గొన్నారు.
కల్హేర్(నారాయణఖేడ్): ఆకలి కావడంతో ఇష్టంగా తింటున్న సమోసా ప్రాణాన్ని బలిగొంది. గొంతులో ఇరుక్కుని ఒకరు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోయిని కాశీరాం(45) పని కోసం బర్దిపూర్ వెళ్లారు. పని చేస్తున్నక్రమంలో ఆకలి కావడంతో అక్కడే హోటల్‌కు వెళ్లి సమోసా తీసుకుని తింటుండగా ఆకస్మత్తుగా గొంతులో ఇరుక్కుందని బంధువులు, గ్రామాస్తులు తెలిపారు. ఊపిరి ఆడక కాశీరాం అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఆరుగురిపై కేసులు
కల్హేర్(నారాయణఖేడ్): ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు పంపిన ఆరుగురిపై కేసులు నమోదు చేశామని కంగ్టి సీఐ డి.వెంకట్‌రెడ్డి గురువారం తెలిపారు. కల్హేర్ మండలం మార్డికు చెందిన కొందరు వ్యక్తులు ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలు ఇతరులకు పంపారన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి వీడియోలు పరిశీలించి ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీలను గుర్తించామన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో చట్టవిరుద్ద కార్యకలపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.
హవేళిఘణాపూర్ తనిఖీలో డీఎస్పీ
హవేళిఘణాపూర్(మెదక్): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. హవేళిఘణాపూర్ పోలీస్‌స్టేషన్‌ను మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ గురువారం ఆకస్మీక తనిఖీ చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్ కేసులు, రికార్డులు, నేరాల నమోదును గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ...గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దన్నారు. అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరాలు నమోదవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మెదక్‌రూరల్ సీఐ కృష్ణమూర్తి, ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.
పటాన్‌చెరు టౌన్: సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికులు, యువత ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాండు రంగారెడ్డి పిలుపునిచ్చారు. పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్‌లో గణేశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన యువ కార్మికుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ దేశాల సహజ వనరులు, సంపదను దోచుకోవడంతోపాటు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. సామ్రాజ్యవాద విధానాల వల్ల కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.


