ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన కార్మికులు
మెదక్ కలెక్టరేట్: తమకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ బీడీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ...తెలంగాణలో ఆసరా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు తీసుకుంటున్న ప్రభుత్వం బీడీ కార్మికుల పెన్షన్లు తీసుకోకపోవడం దారుణమన్నారు. మెదక్ నియోజకవర్గ పరిధిలో మహిళలకు ప్రధాన ఉపాధిగా బీడీ పరిశ్రమ ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాల ఫలితంగా దేశంలో బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భృతిని పెంచకపోగా కొత్తవి కూడా మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన బీడీ కార్మికులకు కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు తీసుకోవడంతోపాటు పాత పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాలమణి, బీడీ కార్మికులు నర్సవ్వ, నాగమణి, పూజ, రజితా, సంధ్య తదితరులు పాల్గొన్నారు.


