వసూళ్లు.. వాటాలు! | - | Sakshi
Sakshi News home page

వసూళ్లు.. వాటాలు!

Mar 5 2026 8:25 AM | Updated on Mar 5 2026 8:25 AM

అనుమతి లేని డాక్యుమెంట్‌ రైటర్ల హవా

డాక్యుమెంట్‌కు రూ. 3 వేలు వసూలు

లిటిగేషన్‌ ల్యాండ్‌లకు కనక వర్షం

అవినీతికి కేరాఫ్‌గా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుంది. ఎలాంటి లైసెన్స్‌లు లేని డాక్యుమెంట్‌ రైటర్లు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వీటిని అధికారులు.. రైటర్లు వాటాలేసి పంచుకుంటున్నారు. లిటిగేషన్‌ ల్యాండ్‌లు ఈ కోటరీకి కనక వర్షం కురిపిస్తున్నాయి. కనీస న్యాయ పరిజ్ఞానం లేని రైటర్లు సైతం డాక్యుమెంట్‌లు తయారు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, సుమారు 35 మంది డాక్యుమెంట్‌ రైటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.

– మెదక్‌ అర్బన్‌

బ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లు చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి సేవలు అందాలన్నా, వీరే క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్‌కు సాధారణంగా రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సుమారు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బాండ్‌ పేపర్‌కు కొంత పోనూ మిగితావి టైప్‌ రైటర్‌, డాక్యుమెంట్‌ ఏజెంట్‌ వాటా లేసి పంచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇక ఏవైనా భూసమస్యలుంటే, వాటి రేటు రూ. వేలల్లో ఉంటుంది. ముఖ్య అధికారి తమకు అనుకూలంగా ఉంటే సరి, లేకుంటే ఆయన లేని సమయంలో కింది స్థాయి ఇన్‌చార్జిలు, రూ. వేలు తీసుకొని పని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటీసీపీ లేని ప్లాట్లు, కచ్చా లేఅవుట్‌, మార్టిగేజ్‌ అయిన ప్లాట్లు, టైటిల్‌ సమస్యలున్న వాటివి కూడా చక్క బెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈసీ, ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ తదితర సేవలకు అందిన కాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. చివరకు డాక్యుమెంట్‌పై సంతకం తీసుకునే ఆఫీస్‌ సబార్డినేట్‌ సైతం డాక్యుమెంట్‌కు రూ.100 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

రద్దు అయినా కొనసాగుతున్న వ్యవస్థ

న్యాయ పరమైన జ్ఞానమున్న అడ్వకేట్‌ లాంటి వారు డాక్యుమెంట్‌ రైటర్లుగా కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కనీస న్యాయ పరమైన పరిజ్ఞానంలేని వారు కూడా, ఏజెంట్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని, డాక్యుమెంట్‌ రైటర్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రాంతాలో, రోజు వారీగా రూ. వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ దందా జోరందుకున్న కాలంలో వీరి ఆగడాలు ఎక్కువ కావడంతో, 2009లో ప్రభుత్వం డాక్యుమెంట్‌ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిసింది. అయినా ఏళ్ల తరబడి దందా నడుపుతున్న వారు, ఇప్పటికీ డాక్యుమెంట్‌ రైటర్లుగా కొనసాగుతున్నారు. అధికారులకు వారధిగా పని చేస్తూ అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొంత మంది కనీసం ఇంటర్‌, డిగ్రీ చదువుకోని వారు కూడా డాక్యుమెంట్‌ రైటర్లుగా పని చేస్తున్నారు. నిజానికి రిజిస్ట్రేషన్‌ లాంటి సేవలకు ఎలాంటి డాక్యుమెంట్‌ రైటర్‌ అవసరం లేదు. విషయమంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అక్కడ పేర్లు వివరాలు మారిస్తే సరిపోతుంది. ప్రస్తుతం మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అదే పద్ధతిన కొనసాగుతున్నాయి. అక్కడ ఎలాంటి డాక్యుమెంట్‌ రైటర్లు లేరు.

నిబంధనల మేరకే సేవలు

2009లో అప్పటి ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్‌ లైసెన్స్‌లు రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించలేదు. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్నవారు, విద్యాధికు లు డాక్యుమెంట్లు తయారు చేసు కోవచ్చు. తాము డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. నిబంధనలకు అనుగుణంగానే సేవలు అందిస్తున్నాం.

– కిరణ్‌కుమార్‌,

మెదక్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement