కలెక్టర్ ప్రతిమాసింగ్
నర్సాపూర్/కౌడిపల్లి: ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపులో జాప్యం చేయొద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. నిర్మాణం పూర్తవగానే నిబంధనల మేరకు బిల్లులు అందుతాయని తెలిపారు. కాగా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఆమె వెంట ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ ప్రభాకర్, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ రాజ్‌కుమార్‌తో పాటు నాయకులు ఉన్నారు. అనంతరం కౌడిపల్లిలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇసుక పంపిణీ చేసిందా..? బిల్లులు వచ్చాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రభుత్వ ఇసుక రాలేదని వారు చెప్పగా, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓను ఎందుకు ఇసుక ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక ఇంటికి 40 టన్నులు ఇసుక సరఫరా చేస్తుందని, ఎంతమంది లబ్ధిదారులు తీసుకున్నారనే వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్, పంచాయతీరాజ్ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ అభిషేక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, ఆర్‌ఐ విజయలక్ష్మి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


