నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: ప్రతి హోటల్ యజమాని తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలు అందించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో లైసెన్స్ మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రచారం లేకపోయినప్పటికీ మేళాకు మంచి స్పందన లభించిందన్నారు. 15 మంది యజమానులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా అందించామన్నారు. జిల్లాలోని ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ షాపుల యజమానులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని, లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారని, వారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. ఆయన వెంట అధికారులు గణేశ్వర్, అరవింద్, నజీర్ తదితరులు ఉన్నారు.


