బిల్లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం
మెదక్ కలెక్టరేట్: ‘వీబీ–జీరామ్‌జీ’ బిల్లుతో దివ్యాంగుల జీవనోపాధికి తీవ్ర అన్యాయం జరుగనుందని ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య ఆరోపించారు. ఆదివారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగం, భూమిలేని, పేదరికంలో ఉన్న దివ్యాంగులకు, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మల్లేశం, జిల్లా కార్యదర్శి యశోద, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, కవిత, గుమ్మడిదల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు కిష్ట య్య, శ్రీనివాస్, మెదక్ పట్టణ అధ్యక్షుడు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


