
పల్లెలకు స్థానిక కళ
మెదక్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఆశావహులు తెరచాటు ప్రచారం ప్రారంభించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న వారు ప్రజలతో మమేకమవుతున్నారు. ఉదయం నుంచి పల్లెల్లో పర్యటిస్తూ పలకరింపులతో ముందుకు సాగుతున్నారు.
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వానికి కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటికే యువ తను, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎంత ఖర్చు చేయాలనే దానిపై లెక్కలు వెసుకుంటున్నారు. వినాయక చవితి సమీపిస్తుండటంతో భారీగా చందాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మండపాల నిర్వాహకులను మచ్చిక చేసుకోవాలంటే ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేదు. ఎవరికి వారు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 5,24,471 మంది ఓటర్లు
జిల్లాలో మొత్తం 5,24,471 మంది ఓటర్లుండగా, ఇందులో మహిళలు 2,72,143, పురుషులు 2,52,319, ఇతరులు 9 మంది ఉన్నారు. కాగా జెడ్పీటీసీ స్థానాలు 21, ఎంపీటీసీ 190, గ్రామ పంచాయతీలు 492, వార్డులు 4,220 ఉన్నాయి. గత పంచాయతీ ఎన్నికల అనంతరం జిల్లాలో ఒక మండలం కొత్తగా ఏర్పడింది. అలాగే 24 పంచాయతీలు ఆవిర్భవించాయి. వీటికి ఈసారి కొత్తగా సర్పంచ్‌లు ఎన్నిక కానున్నారు. సర్పంచ్‌ల పదవీ కాలం ఫిబ్రవరి 2024లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూలై 2024లో ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడిందని, సమస్యలు రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదేశాలే ఆలస్యం..
స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారంతో అప్పట్లో ఎన్నికల నిర్వహణకు ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల ఎన్నికలకు 2041 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 3,738 మంది పోలింగ్ ఆఫీసర్లు అవసరమవుతారు. ఈ మేరకు ఏఆర్‌ఓలు, ఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఎన్నికల సామగ్రి సైతం తెప్పించుకున్నారు. లోకల్ స్టేషనరీ కోసం టెండర్లు సైతం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రీ సింబల్ విధానం అమల్లో ఉన్నందున, బ్యాలెట్ పేపర్లు సైతం అందుబాటులో ఉంచుకున్నారు. గుజరాత్ నుంచి 1,020 బ్యాలెట్ బాక్స్‌లు తెప్పించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు వార్డుల వారీగా టీపోల్ నమోదు కొనసాగిస్తున్నారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన కొనసాగుతున్నందున, బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేయించలేదని జెడ్పీ అధికారులు తెలిపారు.
ఆశావహుల సందడి
ఓటర్లకు పలకరింపులు, ఆర్థిక సహాయాలు
రిజర్వేషన్లపై నేతల్లో ఉత్కంఠ
ఎన్నికలకు సిద్ధం చేసిన అధికారులు