
గురుకులంలో.. మిషన్ ప్రకృతి
రామాయంపేట(మెదక్): విద్యార్థుల్లో పర్యావరణ, సామాజిక స్పృహ పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో మిషన్ ప్రకృతి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) భాగస్వామ్యంతో ఈపథకాన్ని జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, కొల్చా రం గురుకులాల్లో అమలు చేస్తున్నారు. ఇందుకు గాను ప్రతి స్కూల్ నుంచి ఎంపిక చేసిన ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు, ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వీరు ప్రకృతిపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, స్కూళ్లలో తాగు నీటి వినియోగం, శక్తి వినియోగం, వ్యర్థాల పునర్వినియోగం, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ‘మన ప్రకృతిని మనమే రక్షించుకోవాలనే’ నినాదాంతో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. జిల్లా పరిధిలోని ఎంపిక చేసిన స్కూళ్లలో త్వరలో ఈ కార్యక్రమం అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. వారిలో ప్రకృతిలో మమేకమయ్యే తత్వాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఎకో సిస్టం విషయమై సమగ్రంగా వివరించారు. సదరు విద్యార్థులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మిగితా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
విధి విధానాలు ఇలా..
ప్రకృతిపరంగా విద్యార్థులకు అవగాహన కల్పించడం
వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం వంటి అంశాలపై అవగాహన
పాఠశాలల్లో పర్యావరణ ఆడిట్ నిర్వహించడం
శక్తి వినియోగం, నీటి వాడకం, వంటి అంశాలపై భాగస్వాములు చేయడం
విద్యార్థులను ప్రోత్సహించి మొక్కలు నాటించడం, నాటిన వాటిని రక్షించడం
విద్యార్థులతో గ్రీన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా చర్యలు
పచ్చదనం వైపు అడుగులు
జిల్లాలో నాలుగు పాఠశాలల ఎంపిక
ఇది మంచి పథకం
మిషన్ ప్రకృతి మంచి పథకం. పుస్తకాలకే పరిమితం కాకుండా ఏం చేయాలో విద్యార్థులకు నేర్పుతుంది. వారిలో బాధ్యాతాయుతమైన పౌర లక్షణాలతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తుంది. భవిష్యత్తులో ఇది మంచి పరిణామానికి దారితీస్తుంది.
– పద్మావతి, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్

గురుకులంలో.. మిషన్ ప్రకృతి

గురుకులంలో.. మిషన్ ప్రకృతి