జేపీఎస్‌ల కల సాకారం | - | Sakshi
Sakshi News home page

జేపీఎస్‌ల కల సాకారం

Aug 24 2025 9:50 AM | Updated on Aug 24 2025 1:56 PM

జేపీఎస్‌ల కల సాకారం

జేపీఎస్‌ల కల సాకారం

మెదక్‌జోన్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. విధుల్లో చేరి నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తయిన వారిని రెగ్యులర్‌ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 332 మందికి లబ్ధి చేకూరింది. వీరు గ్రేడ్‌ఫోర్త్‌ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా మారనున్నారు. 2019లో పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో జిల్లాలో 332 మంది ఎంపికయ్యారు. వారిలో కొందరు విధుల్లో చేరకుండానే వేరే ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ఫలితంగా పదుల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో మార్కుల ఆధారంగా ఖాళీలను భర్తీ చేశారు. 2019 నుంచి 2020 జూన్‌ వరకు జేపీఎస్‌ ఉద్యోగాల భర్తీ పక్రియ జరిగింది. ఇలా జిల్లావ్యాప్తంగా 332 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా విధుల్లో చేరిన జేపీఎస్‌లకు గత ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ప్రొబిషన్‌ పిరియడ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

త్రిసభ్య కమిటీ ఆధారంగా మార్కులు

కాగా విధుల్లో చేరిన జేపీఎస్‌ల పనితీరును పరిగణలోకి తీసుకొని విధులను బట్టి మార్కులు వేయాలని నిర్ణయించారు. 60 మార్కులకు తగ్గకుండా మార్కులు తెచ్చుకున్న వారిని మాత్రమే విధుల్లో ఉంచాలని, అంతకు తక్కువ మార్కులు వచ్చిన వారిని ప్రొబిషన్‌లోనే తొలగించాలని గత ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. ఆ కమిటీలో అదనపు కలెక్టర్‌, డీఎస్పీ, డీఎఫ్‌ఓ ముగ్గురికి బాధ్యతలు అప్పగించింది. పల్లె ప్రగతి పనులు, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య నిర్వహణ, డంప్‌యార్డులు, వర్మీ కంపోస్టు తయారీ.. తదితర పనులను పరిగణలోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం పెట్టిన అగ్ని పరీక్షలో 60 మార్కులకు తగ్గకుండా విధులు నిర్వహించినట్లు త్రిసభ్య కమిటీ ప్రతిపాదించటంతో అంతా పాస్‌ అయ్యారు. ఇదిలా ఉండగా జేపీఎస్‌లుగా విధుల్లో చేరిన నాటి నుంచి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరిని గ్రేడ్‌ఫోర్త్‌ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు కలెక్టర్‌ జిల్లా లోని ఎంపీడీఓలకు సర్క్యులర్‌ జారీ చేశారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారిని యూనియన్‌ నేతలు ప్రవీణ్‌రెడ్డి, రజినీకాంత్‌, తస్లీమ్‌ పాష, సంగమేశ్వర్‌, కుమార్‌ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

నాలుగేళ్ల సర్వీస్‌ పూర్తయిన వారు

క్రమబద్ధీకరణ

జిల్లాలో 332 మందికి లబ్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement