ఒడిసి పట్టక.. గోదారి ఒడికి | - | Sakshi
Sakshi News home page

ఒడిసి పట్టక.. గోదారి ఒడికి

Aug 23 2025 2:55 AM | Updated on Aug 23 2025 6:33 AM

ఒడిసి

ఒడిసి పట్టక.. గోదారి ఒడికి

వృథా అవుతున్న వర్షపు నీరు

మెతుకుసీమలో చెప్పుకోదగిన సాగునీటి ప్రాజెక్టులు లేవు. దీంతో రైతులు బోరుబావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. ఏకై క మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్టు ఘనపూర్‌ ఉన్నా, దాని ఆయకట్టు అంతంత మాత్రమే. హల్దీ ప్రాజెక్టు, మంజీరా నదులే జిల్లాకు జీవనాధారం. కాగా పాలకుల నిర్లక్ష్యంతో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంతో ఏటా సాగు నీటికి వెతలు తప్పడం లేదు.

– మెదక్‌జోన్‌

హల్దీ, మంజీరానే ఆధారం

జిల్లాకు హల్దీ ప్రాజెక్టు, మంజీరా నదులే ఆయువుపట్టుగా ఉన్నాయి. వాటిపై ఇప్పటికే కొన్ని చెక్‌డ్యాంలు నిర్మించినప్పటికీ, మరికొన్ని అర్ధంతరంగా ఆగిపోయాయి. వాటిని పూర్తి చేస్తే వేలాది ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. గోదావరికి జిల్లాలో ప్రవహించే మంజీరా ఉపనది. ఇది ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 96 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుండగా, మెతుకుసీమలో చిలప్‌చెడ్‌, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్‌, మెదక్‌, హవేళిఘణాపూర్‌ మండలాల పరిధిలో 43 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. దీనిపై 9 చెక్‌డ్యాంలు మంజూరు కాగా, ఇప్పటికీ 6 చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 3 చెక్‌డ్యాంలు గత ఐదేళ్లుగా అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇందులో ప్రధానంగా చిలప్‌చెడ్‌ మండలంలోని ఫైజాబాద్‌లో ఒకటి, చండూర్‌లో మరోటి కాగా, కొల్చారం మండలంలోని కోనాపూర్‌ శివారులో ఒకటి చొప్పున మొత్తం మూడింటికి 2020లో రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం పూర్తయితే 2 వేల పైచిలుకు సాగు భూములకు నీరందుతుంది. అలాగే హల్దీ ప్రాజెక్టు జిల్లాలో 30 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఇది తూప్రాన్‌, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కొల్చారం, మెదక్‌, హవేళిఘణాపూర్‌ పరిధిలో ఉండగా, దీనిపై ఇప్పటికే 21 చెక్‌ డ్యాంలను నిర్మించారు. వెల్దుర్తి మండలం నెల్లూరు, కూకునూర్‌ మండల పరిధిలో మరో రెండు చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించారు. వాటికి ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు.

జిల్లాలో 4 లక్షల ఎకరాల

సాగు భూములు

జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 6 లక్షల పైచిలు కు ఎకరాల భూములు ఉండగా, అందులో నాలుగు లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. మిగితా 2 లక్షల ఎకరాల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో 70 శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. ఏకై క మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్‌ ద్వారా కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది.

మెతుకుసీమకు

తప్పని సాగునీటి వెతలు

ఘనపూర్‌ ఆయకట్టు అంతంతే..

మంజీరాపై అర్ధంతరంగా ఆగిన

3 చెక్‌డ్యాంల నిర్మాణం

హల్దీపై ప్రతిపాదనలకే పరిమితం

వర్షం నీరంతా గోదారి పాలు

ఏటా వేలాది క్యూసెక్యుల వర్షం నీరు వృథాగా గోదావరిలో కలిసిపోతోంది. ఆ నీటికి అడ్డుకట్ట వేస్తే జిల్లాలో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు పేర్కొంటున్నారు. కనీసం విరివిగా చెక్‌డ్యాంలు నిర్మించినా భూగర్భజలాలు పెరిగి ఎటూ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర బోరు బావుల్లో పుష్కలంగా నీరు వస్తుందని, ఫలితంగా సాగునీటి కొరత కొంతలో కొంతైనా తప్పుతుందని అంటున్నారు.

ఒడిసి పట్టక.. గోదారి ఒడికి1
1/1

ఒడిసి పట్టక.. గోదారి ఒడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement