
కొరత పేరుతో దందా
రామాయంపేట(మెదక్): పట్టణంలోని అన్నదాత రైతు సేవా కేంద్రంలో యూరియా బస్తాలకు ఇతర ఎరువులను అంటగడుతూ విక్రయిస్తుండటంతో శుక్రవారం వందలాది మంది రైతులు దుకాణం ఎదుట ఽఆందోళన నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి వీరికి సంఘీభావం ప్రకటించారు. దుకాణానికి సంబంధించి గోదాంలో దాచి ఉంచిన యూరియాను పట్టుకున్నారు. దీంతో కొద్దిసేపు దుకాణం వద్ద ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రైతులను సముదాయించారు. దాచి ఉంచిన యూరియా బస్తాలను రైతులకు అందజేశారు. ఇతర ఎరువులు తీసుకుంటేనే యూరియా బస్తాలను ఇస్తామని దుకాణం యుజమాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గోదాంలో దాచి ఉంచిన 50 బస్తాల యూరియాను పట్టుకున్నట్లు చెబుతుండగా, పది సంచులు మాత్రమే పట్టుబడ్డాయని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి మాట్లాడుతూ.. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇతర ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని ఆగ్రోస్ దుకాణం వ్యాపారి రైతులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇతర ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామన్న డీలర్
ఆందోళన చేపట్టిన రైతులు