
‘భవిత’కు భరోసా
● నేటి నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు ● జిల్లావ్యాప్తంగా 1,305 మంది దివ్యాంగ విద్యార్థులు
పెద్దశంకరంపేట(మెదక్): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే జిల్లావ్యాప్తంగా భవిత కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 1.6 కోట్లు మంజూరు చేసింది. ఆయా కేంద్రాల పరిధిలో వారంలో రెండు రోజుల పాటు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ, ఇతర వైద్య సేవలందిస్తున్నారు. దీంతో పాటు పాఠశాలకు రాలేని వారిని గుర్తించి వారికి హోం బేస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. జిల్లాలో ఆయా మండలాల పరిధిలో 21 మంది ఐఈఆర్‌పీలు పనిచేస్తుండగా, మరో 21 మందిని నియమించాల్సి ఉంది.
గుర్తింపు శిబిరాలు ఇలా..
జిల్లాలో శుక్రవారం పెద్దశంకరంపేట భవిత కేంద్రంలో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్ మండలాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వారికి అవసరమైన పరికరాలను అందించేందుకు ప్రత్యేక వైద్యుల సమక్షంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం తూప్రాన్‌లో నార్సింగి, చేగుంట, మాసాయిపేట, తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, నర్సాపూర్, శివ్వంపేట మండలాల విద్యార్థులకు, ఈనెల 25 సోమవారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో మెదక్, హవేళిఘణాపూర్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల దివ్యాంగ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
త్వరలో ఉపకరణాల పంపిణీ
21 రకాల ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులకు ఈ వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో వారికి అవసరమైన వీల్‌చైర్, క్యాలిపర్స్, హియరింగ్, రోలేటర్, సీపీ చైర్, ఎంఎస్‌ఐడీ కిట్స్, బ్యాటరీ సైకిల్ తదితర పరికరాలను అందించనున్నారు. వైద్య శిబిరాల్లో ఎవరికి ఏం అవసరమో గుర్తించి వారికి పరికరాలను తయారు చేసి అందించనున్నారు. కాగా శిబిరాలకు తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలను తీసుకొని రావాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు.