
అవసరానికి మించి కొనొద్దు
● జిల్లాలో యూరియా కొరత లేదు ● కలెక్టర్ రాహుల్‌రాజ్
రామాయంపేట(మెదక్): ఫర్టిలైజర్ దుకాణదారులు యూరియాతో పాటు ఇతర ఎరువులను లింకు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో పర్యటించారు. పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, అవసరాల మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి నాలుగు నుంచి ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇండెంట్ ఉందని, అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ఇళ్ల వద్ద నిల్వ ఉన్న మురుగు నీటిని తొలగించాలన్నారు. అంతకుముందు మండలంలోని తొనిగండ్లలో పర్యటించి పంట చేలను, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్వయంగా పంట చేనులో నానో యూరియా పిచికారీ చేశారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, ఏడీఏ రాజ్‌నారాయణ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ రఘువరన్, ఇతర అధికారులు ఉన్నారు.
నేడు జిల్లాలో పనుల జాతర
మెదక్ కలెక్టరేట్: నేడు జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి శుక్రవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న ట్లు చెప్పారు. జిల్లాలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్), ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రతి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కనీసం ఒక పని అయిన శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.