
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
చేగుంట(తూప్రాన్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం వడియారంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ కమీషన్ల కోసమే మెగా ప్రాజెక్టులను నిర్మించిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందన్నారు. రెండో విడతగా దుబ్బాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ. 9 వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అర్హులైన పేదలందరికీ 12 లక్షల రేషన్ కార్డులను అందించామని వివరించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రానికి 7 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 50 శాతం మాత్రమే వచ్చిందని, త్వరలోనే అందరికీ యూరియా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా పలు మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, నాయకులు పెంటారెడ్డి, విష్ణు, శ్రీకాంత్, రాజాగౌడ్‌తో పాటు పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.