
వర్షాలకు దెబ్బతిన్న పంటలు
● జిల్లావ్యాప్తంగా 2,484 ఎకరాల్లో నష్టం ● ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు
మెదక్‌జోన్: వారం రోజులుగా జిల్లాలో కురుస్తు న్న భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరిలో ఇసుక మేట లు పేరుకుపోగా, పత్తి, ఇతర ఆరుతడి పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు చెబుతున్నా రు. జిల్లావ్యాప్తంగా వర్షాలకు 3,305 మంది రైతులకు సంబంధించి, ఇప్పటివరకు 2,484 ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. ఇందులో ప్రధానంగా వరి 1,620 ఎకరాలు, పత్తి 687 ఎకరాల్లో దెబ్బతినగా, ఇతర ఆరుతడి పంటలు 177 ఎకరాలలో నష్టం జరిగింది. అత్యధికంగా పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో పత్తి పంటకు నష్టం జరగగా, పాపన్నపేట, మెదక్, శివ్వంపేట, కొల్చారం, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట, చేగుంట మండలాల్లో వరితో పాటు ఇతర ఆరుతడి పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని, వరద ఉధృతి తగ్గే వరకు పూర్తిస్థాయిలో అంచనా వేయలేమంటున్నారు. కాగా పంట నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. కాగా పంటల బీమా లేక పోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ పైనే రైతులు ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేస్తుంది.