
పర్యావరణ హిత సంచులు
● జిల్లాకు 2.14 లక్షల సంచుల సరఫరా ● వచ్చే నెల రేషన్ కోటాతోపాటు పంపిణీ ● బియ్యం తీసుకెళ్లేలా నాణ్యతగా తయారీ
2.14 లక్షల సంచులు
రామాయంపేట(మెదక్): జిల్లాలో రేషన్ వినియోగదారులకు ప్రభుత్వం పర్యావరణ హిత సంచులు అందించనుంది. ఈ మేరకు జిల్లాకు 2.14 లక్షల సంచులు మంజూరు కాగా, అధికారులు గోదాంల కు పంపించారు. రేషన్ వినియోగదారులకు సెప్టెంబర్ బియ్యం కోటాతోపాటు సంచులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు అభయహస్తం చక్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటో, పైభాగంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలను సంచిపై ముద్రించారు. కార్డుల వారీగా సంచులను ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. లబ్ధిదారులు ఈ సంచుల్లోనే బియ్యం తీసుకెళ్లేలా నాణ్యతగా ఈ బ్యాగులను తయారు చేశారు.
తెల్లకార్డు దారులకు సంచులు
సెప్టెంబర్ కోటాలో భాగంగా ప్రతి వినియోగదారునికి రేషన్ డీలర్లు బియ్యంతోపాటు పర్యావరణ హిత సంచులు అందించాలి. ఈ సంచుల్లోనే బియ్యం తీసుకెళ్లాలి. ఈ సంచులు అన్ని విధాలుగా శ్రేయస్కరం.
– జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి
జిల్లా పరిధిలో 520 రేషన్ దుకాణాలుండగా, కొత్తవాటితో కలిపి మొత్తం 2,32,579 తెల్ల కార్డులున్నాయి. ఈ కార్డులకు గాను ప్రతి నెలా 38 వేల క్వింటాళ్ల సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి వినియోగదారులకు అందజేశారు. గడువు ముగియడంతో సెప్టెంబర్ నుంచి నెలవారీ కోటా అందించనున్నారు. లబ్ధిదారుల వేలు ముద్రలు పోల్చుకున్న తరువాతే వారికి సంచులు, బియ్యం అందించనున్నారు.

పర్యావరణ హిత సంచులు

పర్యావరణ హిత సంచులు