
కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడిస్తాం
● యూరియా కొరత తీర్చాల్సిందే ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
చేగుంట(తూప్రాన్): యూరియా కొరత తీర్చకుంటే రైతులతో కలిసి కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఎమ్మెల్యే.. చేగుంట రైతు సేవ కేంద్రం వద్ద ఆగి క్యూలైన్‌లో ఉన్న రైతులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సైతం యూరియా నిలువలను ఉంచామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మండల కేంద్రాల్లోనే యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం యూరియా కొరతను తీర్చాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, రాజిరెడ్డి, రమేశ్, శివ, మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వాల వైఫల్యమే కారణం
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.