
జల దిగ్బంధంలోనే దుర్గమ్మ
పరిస్థితి సమీక్షించిన ఎస్పీ శ్రీనివాస్ రావు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ ఆరో రోజు మంగళవారం జల దిగ్బంధంలోనే ఉంది. ఘనపురం ఆనకట్టపై నుంచి 54,916 క్యూసెక్కుల నీరు దిగువకు వదలడంతో మంజీరా జలాలు దుర్గమ్మ పాదాలను తాకుతూ ప్రవహిస్తున్నాయి. ఎస్పీ శ్రీనివాస్ రావు ఉదయం ఏడుపాయలకు వచ్చి వరద పరిస్థితిని సమీక్షించారు. మంజీరా నది వైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ఫీల కోసం నది ప్రవాహం వైపు వెళ్లొద్దని సూచించారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌బీ సీఐ సందీప్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. దుర్గమ్మ తల్లికి రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఎల్లాపూర్ వద్ద జల ప్రవాహం నిన్నటితో పోలిస్తే కొంచెం తగ్గింది. బీఆర్‌ఎస్ నేత పుణీత్ రెడ్డి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.