
వరద హోరు
వాన జోరు..
● పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు ● జిల్లాకు అరెంజ్ అలర్ట్ జారీ ● ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు
నర్సాపూర్/కొల్చారం/రేగోడ్(మెదక్): జిల్లాలో ఎ డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ రాయరావు చెరువు అలుగు వద్ద శనివారం మత్స్యకారులు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు ఉదయం నుంచి చెరువు వద్ద సందడి చేస్తుండగా, పోలీసులు చెరువు వద్దకు ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అలాగే రేగోడ్ మండలంలోని జగిర్యాల చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జగిర్యాల–రేగోడ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్‌ఐ పోచయ్య చెరువును సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కొల్చారం మండలవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. కింది భాగంలోని వరి పొలాలు నీట మునిగాయి. చిన్నఘనాపూర్ వైపు గల ఘనపురం ప్రాజెక్టు సింగూర్ జలాలతో నిండుకుండలా మారింది. ఆనకట్ట పైభాగం నుంచి రెండున్నర ఫీట్ల మేర నీరు ప్రవహిస్తుండడంతో జలకళ సంతరించుకుంది. పర్యాటకులు సెల్ఫీలు దిగేందుకు నీటిలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
నర్సాపూర్: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినందున ఆయా శాఖల అధికారులు, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శనివారం రాయరావు చెరువును పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని నర్సాపూర్, శివ్వంపేట, టేక్మాల్, అల్లాదుర్గం తదితర మండలాల్లో అత్యధిక వర్షం కురిసిందని తెలిపారు. ఆదివారం వరకు వర్ష సూచన ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున నీరు విడుదల చేశారని, మంజీరా పరివాహాక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని వివరించారు. ప్రాజెక్టులు, చెరువుల వద్ద పర్యాటకులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అధికారుల సెలవులు రద్దు చేశామని, అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం నర్సాపూర్ మున్సిపాలిటీలోని 6, 7, 9వ వార్డులలో కలెక్టర్ పర్యటించారు ఇళ్లలోకి వర్షం నీరు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డిని ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ పరిశీలన
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్‌ను శనివారం కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని సిబ్బందిని అ డిగి తెలుసుకున్నారు.