
మోక్షమెప్పుడో..?
పరిష్కారం కాని భూ సమస్యలు జిల్లాలో ‘భూ భారతి’దరఖాస్తులు 38 వేలు ఇప్పటివరకు పరిష్కరించినవి2 వేలు మాత్రమే.. పంద్రాగస్టుకు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం
మెదక్‌జోన్: భూ భారతి దరఖాస్తుల పరిష్కారం జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. జిల్లావ్యాప్తంగా జూన్ 3 నుంచి 20 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి అధికారులు 38 వేల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 2 వేలు మాత్రమే పరిష్కరించారు. ఈ లెక్కన ఇంకా 36 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగితా వాటిని ఎప్పుడు పరిష్కరిస్తామనేది అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు.
మిస్సింగ్ సర్వే నంబర్లే అధికం
జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి మొత్తం 38 వేల దరఖాస్తులు రాగా, అందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించినవే 10 వేల దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించినవి 7 వేలు, సాధా బైనామాలు 6,500, ఫౌతి (మ్యుటేషన్లు) 2 వేలు రాగా, పేర్లు, ఖాతా నంబర్‌లో తప్పులు, పొజిషన్లు, ఇనాం భూములు తదితర వాటికి సంబంధించి మరో 12,500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత
జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం జీపీఓలను నియమిస్తామని చెప్పింది. గతంలో వీఆర్‌ఓలుగా విధులు నిర్వర్తించిన వారికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించినా, కేవలం 120 మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే పరీక్షల్లో 99 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో భూములు సర్వే చేసేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, 210 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 107 మందికి 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మిగితా 103 మందికి ఈనెల 18 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే శిక్షణ పూర్తయిన 107 మంది సర్వేయర్లకు ఒక్కొక్కరికి 3 నుంచి 4 మండలాల చొప్పున కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10 మంది సర్వేయర్లు వీరికి క్షేత్రస్థాయి విధుల్లో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
త్వరలోనే పరిష్కారం
క్షేత్రస్థాయి సిబ్బంది కోసం రెండు సార్లు పరీక్ష నిర్వహిస్తే 99 మంది జీపీఓలు ఎంపికయ్యారు. వారితో పాటు ఆఫీస్ సిబ్బంది మరో 100 మంది వరకు ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ క్లస్టర్లు 76 ఉండగా, పెద్ద క్లస్టర్‌కు ముగ్గురిని, చిన్న క్లస్టర్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం. అలాగే 107 మంది ట్రైనీ సర్వేయర్లు వచ్చారు. ఇక భూ సమస్యలను ముమ్మరంగా పరిష్కరిస్తాం.
– నగేశ్, అదనపు కలెక్టర్