
రైతు చట్టాలపై అవగాహన అవసరం
నర్సాపూర్/కౌడిపల్లి/కొల్చారం/చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు సునీల్ అన్నారు. లీప్స్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నర్సాపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సాగు న్యాయ యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టాలను రైతులకు చుట్టాలుగా చేయాలనే లక్ష్యంతో సాగు న్యాయ యాత్ర చేపట్టినట్లు వివరించారు. రైతులు భూ, సాగు నీటి సమస్యలు, విత్తనం, పంట రుణాలు, పంటల బీమా మార్కెట్ తదితర వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో నష్టం వాటిల్లితే చట్టాలను ఉపయోగించుకొని రైతులు న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. సమావేశం అనంతరం మండలంలోని పెద్దచింతకుంటలో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అలాగే కౌడిపల్లి, కొల్చారం, చేగుంట, చిన్నశంకరంపేటలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు. భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ఓఎస్‌డీ శ్రీహరి వెంకటప్రసాద్, అధికారులు రైతులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు సునీల్