
ఇందిరమ్మ ఇంటికి ఇసుక తిప్పలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు భారంగా మారింది. ఇంటి నిర్మాణానికి ఇసుక తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో శాండ్ బజార్లు ఏర్పాటు చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మారాయి. దీంతో ఇంటి నిర్మాణ వ్యయంలో సుమారు మూడో వంతు ఇసుక కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని లబ్ధిదారులు వాపోతున్నారు. బయట టన్నుకు రూ. 2,600 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, దీనికి రవాణా చార్జీలు అదనమని వాపోతున్నారు.
– మెదక్ అర్బన్
జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ పట్టణాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని అధికారుల సంకల్పించారు. కాళేశ్వరం, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొచ్చి, ఈ పాయింట్లలో నిల్వ చేసి, లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేయాలని సంకల్పించారు. అయితే ట్రాన్స్‌పోర్టు మాత్రం లబ్ధిదారులే భరించాలని సూచించారు. కానీ ఇప్పటివరకు సంబంధిత ప్రాంతాల్లో ఇసుక నిల్వలకు స్థలం దొరకడం లేదని తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా, మార్కెట్ యార్డుల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారులు వ్యయ, ప్రయాసల కోర్చి, బయట టన్నుకు రూ. 2,600 చెల్లించి ఇసుక కొనుగోలు చేస్తున్నారు. దీనికి ట్రాన్స్‌పోర్టు అదనం. ఒక్క ఇందిరమ్మ ఇంటికి సుమారు 60 టన్నుల ఇసుక అవసరం అవుతుందని మేసీ్త్రలు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే, ఇందిరమ్మ ఇంటి బిల్లులో సుమారు రూ. 1,80,000 వరకు ఇసుకకే ఖర్చు అవుతుంది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్లు అన్నీ ఒకేసారి ప్రారంభం కావడంతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగాయి. సిమెంట్, స్టీల్, మేసీ్త్రలు, కూలీల ఖర్చులు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే బిల్లుకు అదనంగా సుమారు రూ. 3 లక్షల వరకు లబ్ధిదారులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిల్లుల చెల్లింపులో సైతం కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బ్యాంకు పాస్‌బుక్‌లో పేర్లు తప్పుగా నమోదు కావడం, ఆధార్, బ్యాంకు లింకు లేకపోవడం, తదితర కారణాలతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లుతెలుస్తుంది.
పాపన్నపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు