
కోమటికుంట కాల్వను పునరుద్ధరించాలి
నర్సాపూర్: కోమటికుంట అలుగు కాల్వను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె పట్టణంలో పర్యటించారు. తొలుత ఇరిగేషన్ డీఈఈ బుజ్జిబాబు, ఏఈ మణిభూషన్, మున్సిపల్ కమిషనర్ రాంచరణ్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, పలు కాల్వలను పరిశీలించారు. అనంతరం రాయరావు చెరువు కట్టు కాల్వను పరిశీలించారు. కాల్వలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగు నివారణ మాత్రలు వేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 731 సర్వే నంబర్‌లో 35ఎకరాల భూమి రెవెన్యూ శాఖదని గతంలో ఆ శాఖ అధికారులు తేల్చారని గుర్తు చేశారు. ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ భూమి తమదని చెబుతున్నారని అన్నారు. ఈ భూమిలో ఇప్పటికే మున్సిపాలిటీకి చెందిన డంప్‌యార్డు నిర్మించడంతో పాటు ఓయూ పీజీ కాలేజీకి 10 ఎకరాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు మిగితా భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించారన్నారు. ప్రస్తుతం ఆ భూమి తమదని అటవీశాఖ చెప్పడంతో సమస్య తలెత్తిందన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌తో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి